నరేంద్రనగర్‌లోని పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ సత్య శారద ఆకస్మికంగా సందర్శిన


జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్: 

వరంగల్ నగరంలోని నరేంద్రనగర్‌లోని పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు, అలాగే సాయంత్రం విద్యార్థులకు అందిస్తున్న స్నాక్స్‌ను కలెక్టర్ పరిశీలించారు.పాఠశాల సందర్శన సందర్భంగా జిల్లా కలెక్టర్ పదో తరగతి విద్యార్థుల హిందీ, ఇంగ్లీషు, గణితం తదితర సబ్జెక్టుల పఠన సామర్థ్యాన్ని పరిశీలించారు. విద్యార్థులు ఇష్టపడి చదివి పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించాలని, లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిరంతరం శ్రమించాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, పాఠ్యాంశాలను సులభంగా అర్థమయ్యేలా బోధిస్తూ వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా సబ్జెక్టు లలో వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధతో బోధన చేయాలని సూచించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు సాయంత్రం అందిస్తున్న స్నాక్స్ నాణ్యత, పంపిణీ విధానాన్ని పరిశీలించి, పోషకాహార ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు.పాఠశాలలో ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న కిచెన్ గార్డెన్‌ను  కలెక్టర్  పరిశీలించారు. ఈ సందర్భంగా కిచెన్ గార్డెన్‌లో పెంచుతున్న కూరగాయల రకాలు, సాగు విధానం, నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పోషకాహారం అందించడంతో పాటు వ్యవసాయంపై అవగాహన కల్పించే విధంగా కిచెన్ గార్డెన్‌ను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.పాఠశాల అవసరాలకు అనుగుణంగా ఆకుకూరలు, కూరగాయలను సాగు చేయాలని, సేంద్రియ పద్ధతుల ద్వారా పంటలు పండించాలని కలెక్టర్ తెలిపారు. కిచెన్ గార్డెన్ నిర్వహణలో విద్యార్థులను భాగస్వాములుగా చేయడం ద్వారా వారిలో శ్రమ విలువ, ప్రకృతి పట్ల బాధ్యతాభావం పెంపొందుతుందని పేర్కొన్నారు.టాయిలెట్లను పరిశుబ్రాంగా నిర్వహించాలని ఈ సందర్భంగా సానిటరీ కార్మికులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్య నాయుడు, జిల్లా ఉద్యానవన అధికారి శ్రీనివాసరావు, స్టాటిస్టికల్ ఆఫీసర్ వేణుగోపాల్, పాఠశాల ప్రాధానోపాధ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments