భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శం




భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శం

 (జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):

రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆత్మకూరు మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఆత్మకూరు, కామారం, నీరుకుళ్ళ, పెంచికలపేట, చౌళ్ళపల్లి గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో హిందూ బంధువులు, యువత, మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమానికి హైదరాబాద్ అనంత సాహితి ఆశ్రమానికి చెందిన స్వామి అనంతానంద భారతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శమని అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ ప్రతి హిందువుడి బాధ్యత అని, సమాజంలో ఐక్యత పెంపొందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. యువత సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు ముందుకు రావాలని సూచించారు.అలాగే ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ సహ ప్రాంత ప్రచారక్ ప్రభు కుమార్ మాట్లాడుతూ హిందూ సమాజంలో ఐక్యత, పరస్పర సహకారం ఎంతో అవసరమని చెప్పారు. సమాజంలో ధార్మిక విలువలను పెంపొందించేందుకు ఇలాంటి సమ్మేళనాలు దోహదపడతాయని తెలిపారు. హిందూ సమాజం బలంగా ఉంటే దేశం కూడా బలంగా ఉంటుందని పేర్కొన్నారు.

సీనియర్ జర్నలిస్టు, సెన్సార్ బోర్డ్ సభ్యురాలు దేవికా రెడ్డి మాట్లాడుతూ హిందూ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు. కుటుంబాల్లో పిల్లలకు చిన్నప్పటి నుంచే సనాతన విలువలు, సంస్కృతి గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు. సమాజంలో ఐక్యత, సౌహార్దం పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.


కార్యక్రమంలో భాగంగా గోపూజ, తులసి పూజ నిర్వహించడంతో పాటు భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థల ప్రతినిధులు, గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాట్లాడిన నిర్వాహకులు ఇలాంటి ధార్మిక, సామాజిక కార్యక్రమాల ద్వారా సమాజంలో ఐక్యతను మరింత బలోపేతం చేయాలని తమ లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ హిందూ సమ్మేళన ఉత్సవ సమితి నిర్వాహకులు మాజీ జెడ్పీ టీసీ  తింగిలి సత్యనారాయణ , స్థానిక సర్పంచ్ మహేశ్వరి, కామారం సర్పంచ్ లక్ష్మీ, నిర్వాహకులు నాగబండి శివ ప్రసాద్,  పో లు రాజేష్ కుమార్ , ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments