_ ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ
-ఓపీ నమోదు, మాతా-శిశు సేవలు, ఫార్మసీ, ఇమ్యునైజేషన్ విభాగాల పరిశీలన
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు): .
హన్మకొండ జిల్లాలో గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు నాణ్యమైన, వైద్య సేవలు సకాలం లో అందించడమే ప్రధాన లక్ష్యమని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఓపీ విభాగం, మందుల నిల్వ గది, ల్యాబ్, ప్రసూతి గది, ఆపరేషన్ థియేటర్, అబ్జర్వేషన్ వార్డులు, టీకాల నిల్వ కేంద్రం, రికార్డుల నిర్వహణ,ఓపీ నమోదు విధానం, వైద్యులు, సిబ్బంది హాజరు పట్టిక, మాతా-శిశు సంరక్షణ సేవల రికార్డులను పరిశుభ్రత తదితర అంశాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.ఓపీ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారా అని ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగంగా, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ సకాలంలో వైద్యం అందించాలన్నారు. ఓపీ వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, గర్భిణులకు నాణ్యమైన మాతా-శిశు ఆరోగ్య సేవలు అందించాలని ఆదేశించారు. అవసరమైన మందులు ఫార్మసీలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగేలా ప్రతి ఉద్యోగి సేవాభావంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలు ప్రజలకు పూర్తిస్థాయిలో చేరేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ నిర్వహించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ గ్రామ సర్పంచ్ పర్వత గిరి మహేశ్వరి, తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, వైద్యాధికారి డాక్టర్ స్పందన, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
0 Comments