ఖానాపూర్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

(జై భారత్ వాయిస్ న్యూస్  వరంగల్  )
 విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని వరంగల్ జిల్లా ఖానాపూర్ ఎంపిడిఓ వనపర్తి అద్వైత అన్నారు.  ద్రోణాచార్యుడు అర్జునుడిలోని ప్రతిభను గుర్తించి అతడిని మహావిలుకాడిగా తీర్చిదిద్దినట్లే, నేటి ఉపాధ్యాయులు కూడా ప్రతి విద్యార్థిలోని ప్రతిభను వెలికితీసి అర్జునుల వంటి శిష్యులను తయారు చేయాలని సూచించారు.  ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖానాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన గురుపూజోత్సవం సందర్భంగా మండల ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ఉపాధ్యాయ వృత్తి అత్యంత పవిత్రమైనదని, జాతి భవిష్యత్తును నిర్మించే బాధ్యత ఉపాధ్యాయుల భుజాలపై ఉందన్నారు. విద్యార్థుల్లో జ్ఞానంతో పాటు విలువలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానాన్ని పెంపొందించాలని సూచించారు. తహసీల్దార్ రమేష్ మాట్లాడుతూ విద్య సమాజ అభివృద్ధికి మూలస్తంభమని, ఆ విద్యను అందించే ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలని కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సేవలు ప్రశంసనీయమన్నారు. ఖానాపూర్  ఎంఈఓ  బానోత్ వెంకట్రామ్ మాట్లాడుతూ మండలంలో విద్యా ప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సమిష్టిగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఉత్తమ సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి సన్మానించడం ద్వారా మరింత ఉత్సాహం కలుగుతుందన్నారు.ఈ సందర్భంగా మండలంలోని వివిధ పాఠశాలల్లో విశిష్ట సేవలు అందించిన 15 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది.

Post a Comment

0 Comments