జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గీసుకొండ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఘనంగా యోగా వేడుకలు నిర్వహించారు. యోగా ట్రైనర్లు ఎన్. ఇందిర, అడప సాంబశివరావు ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత, మహిళలు, గ్రామ ప్రజలు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక యోగా ఆసనాలు, ప్రాణాయామాలు నిర్వహించారు. “యోగాతో ఆరోగ్యం – యోగాతో ఆనందం” అనే సందేశంతో సాగిన కార్యక్రమం ఆకట్టుకుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గీసుకొండ సర్పంచ్ వీరగోని రాజ్‌కుమార్ మాట్లాడుతూ, యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన ఆరోగ్య సంపద అని అన్నారు. ప్రతి కుటుంబం యోగాను దినచర్యలో భాగం చేసుకుని ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ బాబు మాట్లాడుతూ, యోగా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను అందించి ఏకాగ్రత, కార్యదీక్షను పెంపొందిస్తుందని తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుభాష్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నమ్రత మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర వికాసం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాస పెంపొందింపులో యోగా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, యోగా ఒక రోజు కార్యక్రమంగా కాకుండా ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని అన్నారు. ప్రధాన కార్యదర్శి వీరగోని శ్యామ్ గౌడ్ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించగా, కోశాధికారి పసుల శివనారాయణ నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు.
యోగా కన్వీనర్ ముల్క సత్యం కార్యక్రమ సమన్వయంతో వేడుకలు విజయవంతమయ్యాయి. గౌరవ అధ్యక్షుడు రామ కుమారస్వామి, సీనియర్ అడ్వైజర్లు కోల కుమారస్వామి, పొగాకు కుమారస్వామి, ఉపసర్పంచ్ కోట ప్రమోద్, అంగన్‌వాడీ టీచర్ వీరగోని నిర్మల పాల్గొని యోగా ప్రాముఖ్యతను కొనియాడారు. యోగా ట్రైనర్లు ఎన్. ఇందిర, అడప సాంబశివరావు యోగా సాధన వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించి పలు ఆసనాలు, ప్రాణాయామ విధానాలను ప్రదర్శించారు. అనంతరం వారి సేవలను గుర్తిస్తూ గీసుకొండ వాకర్స్ అసోసియేషన్ తరఫున శాలువాలతో ఘనంగా సన్మానించారు. యోగాను ప్రతి ఇంటికి చేర్చాలనే సంకల్పంతో నిర్వహించిన ఈ కార్యక్రమం గీసుకొండలో ఆరోగ్య చైతన్యానికి కొత్త ఊపునిచ్చింది. కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
0 Comments