పత్తిలో తలమాడు తెగులు నివారణ చర్యలు చేపట్టాలి గులాబీ పురుగుపై రైతులు అప్రమత్తంగా ఉండాలి

 


జైభార‌త్ వాయిస్ న్యూస్ గీసుకొండ‌
పత్తి పంటలో ప్రస్తుత పొడి వాతావరణ పరిస్థితుల వల్ల రసం పీల్చే పురుగుల ద్వారా తలమాడు తెగులు, గులాబీ రంగు పురుగు ఆశించే అవకాశం ఉన్నందున, రైతులు అప్రమత్తంగా ఉంటూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (TRVK) శాస్త్రవేత్త  రాజకుమార్  మండ‌ల‌వ్యవసాయ శాఖ అధికారి హరిప్రసాద్  సూచించారు.గీసుకొండ మండలం మనుగొండ గ్రామంలో రైతు చాపర్తి రంజిత్ కు చెందిన పత్తి పంటను క్షేత్రస్థాయిలో సందర్శించి, పంట ఆరోగ్యాన్ని పరిశీలించి రోగ నిర్ధారణ చేశారు. గ‌త‌ఆగస్టు మాసంలో కురిసిన వర్షాలకు పొలాల గట్లపై పెరిగిన కలుపు మొక్కల వల్ల, ప్రస్తుత బెట్ట (పొడి) వాతావరణంలో తామర పురుగుల ఉధృతి పెరుగుతుంది. ఇవి టొబాకో స్ట్రీక్ వైరస్‌ను వ్యాప్తి చేసి తలమాడు తెగులుకు దారితీస్తాయని తెలిపారు.    ఈ తెగులు వల్ల దిగుబడి దాదాపు 62 శాతం వరకు తగ్గే ప్రమాదం ఉందనిఈ తెగులు సోకినా మొక్కల లేత ఆకులు రంగు మారి, ఎదుగుదల ఆగి కుచించుకుపోతాయని. చివరికి ఆకులు నల్లగా మారి మాడిపోతాయి. కొమ్మలు ఎండిపోయి, పూమొగ్గలు, గూడలు మాడిపోయి రాలిపోతాయి. ఈ వ్యాధి గట్లపై ఉండే వయ్యారిభామ, తుత్తురు బెండ వంటి కలుపు మొక్కలు పూత దశలో ఉన్నప్పుడు, తామర పురుగులు వాటి పూలలోని వైరస్ కలిగిన పుప్పొడిని పత్తి మొక్కలకు వ్యాప్తి చేస్తాయని అన్నారు.నివారణకు చేనులో గట్లపైన ఉన్న వయ్యారిభామ వంటి కలుపు మొక్కలను పూతకు రాకముందే పీకి నాశనం చేయాలని, వైరస్ వ్యాప్తి చేసే తామర పురుగులను ఆకర్షించి చంపడానికి ఎకరాకు 20 నీలిరంగు జిగురు అట్టలను అమర్చుకోని, పంట తొలి దశలో లీటరు నీటికి 5 మి.లీ. వేపనూనె కలిపి పిచికారీ చేయాలన్నారు. 


 తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ. లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా. లేదా డైఫెంథియూరాన్ 1.25 గ్రా. కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు ప‌త్తి పంట‌లోపూత దశ నుండి కాయ నిండు దశ వరకు గులాబీ రంగు పురుగు ఆశించి పూలను 'గుడ్డి పూలు'గా మారుస్తుందని  పూత దశలో కనిపించే గుడ్డి పూలను ఏరివేసి నాశనం చేయాలి.లీటరు నీటికి 5 మి.లీ. వేపనూనె (1500 ppm) కలిపి పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు లీటరు నీటికి 1.5 గ్రా. థయోడికార్బ్ లేదా 2 మి.లీ. ప్రొఫెనోఫాస్ కలిపి పిచికారీ చేయాలన్నారు.ఈ క్షేత్ర సందర్శన కార్యక్రమంలో TRVK శాస్త్రవేత్త కోఆర్డినేటర్  బి.వి. రాజకుమార్, మండల వ్యవసాయ అధికారి ( పి. హరి ప్రసాద్ బాబుతోపాటు  ఏఎంసి  డైరెక్టర్ ఆకుల రుద్ర ప్రసాద్, ఏలుకుర్తి క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి పి. స్మిత,  మనుగొండ, చంద్రయ్యపల్లి గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments